భూతసంఖ్యా పద్ధతి | BhutaSankhya System | Indian Mathematical Heritage | Rajan PTSK | Vedic Maths
HTML-код
- Опубликовано: 23 дек 2024
- BhutaSamkhya System Explained
భారతీయ ప్రతిభా విశేషాలలో భాగంగా కొన్ని రోజుల క్రితం మనం మన అజగవలో కటపయాది పద్ధతి గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఆ పద్ధతికంటే కూడా ప్రాచీనమైన భూతసంఖ్యా విధానం గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా పిశాచాలను, దెయ్యాలనే భూతాలు అన్న అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం. కానీ, అసలు పుట్టింపబడింది ఏదైనా సరే భూతమే. ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి ఈ ఐదింటిని పంచభూతాలంటాం. అలానే మనుషులు, పక్ష్యులు. పశువులు, దేవతలు, గ్రహాలు ఇలా ఇవన్నీ కూడా భూతాలే. అందుకే మనం “యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా” అంటూ జగన్మాతను ప్రార్థిస్తాం. అలా మనందరికీ బాగా తెలిసిన భూతముల పేర్లతోను, వాటి పర్యాయపదాలతోను సంఖ్యలను సూచిస్తూ ఈ భూతసంఖ్యాపద్ధతిని తయారుచేశారు మన మహర్షులు.
కటపయాది పద్ధతిలో అక్షరాలను అంకెలతో సూచిస్తే, ఈ భూతసంఖ్యా విధానంలో సంఖ్యలను అర్థవంతమైన పదాలతో సూచిస్తారు. అంటే ఆ పదం వినగానే మనకు కచ్చితంగా ఆ సంఖ్యే గుర్తుకు వస్తుంది. ఉదాహరణకు ఇలాంటి భూతసంఖ్యను సూచించే శ్లోకంలో ఆకాశం అని వస్తే అక్కడ దాని విలువ సున్నా అని వేసుకోవాలి. మరి ఆకాశం అంటే శూన్యం కదా! అలానే ఎక్కడైనా వేదము అని వస్తే దాని విలువ నాలుగు. ఎందుకంచే వేదములు అనగానే మనకు చతుర్వేదములు అన్న మాటే గుర్తుకు వస్తుంది. అలానే ఏనుగు అని వస్తే దాని విలువ 8. ఎందుకంటే.. ఏనుగులు ఎన్నున్నా ప్రధానమైనవి ఎనిమిది. అవే అష్ట దిగ్గజాలు. అందువల్ల ఏనుగును సూచించే సంఖ్య 8. ఈ పద్ధతిలో వాడే పేర్లన్నీ ప్రసిద్ధి చెందినవే ఉంటాయి కనుక మనం సులభంగానే ఆ సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే.. ఆకాశం, గగనం, వ్యోమం, అంబరం ఇలా ఆకాశానికి సంబంధించిన ఏ పర్యాయపదం వచ్చినా దాని విలువ సున్నానే. అలానే గజము, సింధూరం, ఇభము, కుంజరం, కరి ఇలా ఏనుగుకి సంబంధించిన ఏ పర్యాయపదం వచ్చినా దాని విలువ ఎనిమిదే. ఈ భూతసంఖ్యా పద్దతిలో ఎక్కువగా వాడే పేర్లను ఈ భాగం చివరిలో చెప్పుకుందాం.